విజయవాడలో భారీ బందోబస్తు
హైదరాబాద్ – గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న తనను అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. తనను గచ్చిబౌలి నుంచి భారీ భద్రత మధ్య బెజవాడకు తరలించారు. వంశీ ఇంటికి నోటీసులు అంటించారు. కాగా నగరంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ , బాబు భార్య భువనేశ్వరిని అనరాని మాటలు అన్నారు. అంతే కాదు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైఎస్సార్సీపీ పవర్ ను కోల్పోయింది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ సమయంలో ప్రధాన నేతలను అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది కూటమి సర్కార్. తాము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి తీరుతామని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. ఇందులో భాగంగా అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి, భూమన కరునాకర్ రెడ్డి, రోజాలను అరెస్ట్ చేయొచ్చని సమాచారం.