ఘనంగా కోదండ రాముడి ఉత్సవాలు
తిరుపతి – తిరుపతిలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించు కునేందుకు పోటెత్తారు.
నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడ సేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహా విష్ణువుకు నిత్య వాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్ర గణ్యుడైన వైనతేయుడు కోదండ రామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.