DEVOTIONAL

గరుడ వాహనంపై సిరులతల్లి

Share it with your family & friends

శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. అమ్మ వారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మ వారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.

గరుడసేవ రోజున అమ్మ వారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వ‌స్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామి వారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మ వారికి గరుడ సేవ జరుగుతున్నపుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మ వారికి తన బంగారు పాదాల‌ను పంపుతున్నారు.

గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారు, అమ్మ వారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు.

గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఉడిపి పి పెజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ, ఈవో శ్రీ శ్యామల రావు, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ జంగా కృష్ణమూర్తి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.