గంభీర్ రాకతో శాంసన్ కు ఛాన్స్ దక్కేనా
బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరు మారేనా
హైదరాబాద్ – వరల్డ్ కప్ ముగిసింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తయింది. హెడ్ కోచ్ గా భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తాజాగా టీమిండియా ప్రధాన శిక్షకుడిగా ఖరారు చేసింది. ఆయనకు వార్షిక వేతనం రూ. 12 కోట్లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లించేందుకు ఓకే చెప్పింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).
ఇదిలా ఉండగా తాను హెడ్ కోచ్ గా వచ్చే కంటే ముందు పలు కండీషన్స్ పెట్టాడు గంభీర్. ప్రధానంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అనుసరిస్తున్న విధానాల పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నాడు. మనోడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని , తను తీసుకునే నిర్ణయాలలో ఎవరి జోక్యం ఉండ కూడదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం.
గౌతమ్ గంభీర్ రాకతో ఇప్పటి దాకా ఉన్న విధానాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ద్రవిడ్ వ్యవహార శైలి, అనుసరించే పద్దతులకు భిన్నంగా ఉంటాయి గంభీర్ వి. దీనికి కారణం తను ఏనాడూ ఓటమిని ఒప్పుకునే మనస్తత్వం కాదు. ఎలాగైనా సరే గెలుపు కావడమే తన ముందున్న లక్ష్యం.
దీంతో ఇప్పటికే ఐపీఎల్ లో సత్తా చాటిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ భారత జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉండాల్సిన వాడంటూ పేర్కొన్నాడు. ఇప్పటి దాకా పక్కన పెడుతూ వచ్చిన బీసీసీఐ గంభీర్ రాకతో తనకు ఛాన్స్ దక్కనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.