జీవో29 రద్దు చేయాలని ఆందోళన
గ్రూప్ 1 పరీక్షలపై సుప్రీంకోర్టుకు
హైదరాబాద్ – ఓపెన్ కేటగిరీ లో దళిత , గిరిజన , బడుగు వర్గాల కు ప్రవేశం లేదంటూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యాంగ వ్యతిరేక GO 29 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు, నిరుద్యోగులు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు దాడులకు దిగారని బాధితులు ఆరోపించారు.
ఈ సందర్బంగా నిరుద్యోగులు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ( SLP) ను వెంటనే విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. సోమవారం దీనిపై విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. కాగా తాము న్యాయపరమైన డిమాండ్ ను కోరుతున్నామని, కానీ ప్రభుత్వం కావాలని తమను పట్టించు కోవడం లేదని ఆరోపించారు గ్రూప్ 1 ఆశావహులు.
ఇంత జరుగుతున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం పట్ల వాపోయారు. శాంతియుతంగా పోరాడుతున్న తమపై దాడి చేయడం, అరెస్ట్ చేయడం, కేసులు నమోదు చేయడం, కరెంటు కట్ చేయడం, యుద్ద వాతావరణం సృష్టించడం ఏ మాత్రం సరికాదన్నారు. పేద అభ్యర్థులను సోమరులు, పెయిడ్ ఆర్టిస్టులంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.