సీఎంను కలిసిన డిప్యూటీ మేయర్
శ్రీలతా శోభన్ రెడ్డికి అభినందన
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కింది స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు సైతం పక్క చూపులు చూస్తున్నారు. ప్రధానంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాష్ గౌడ్ జంప్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆ తర్వాత పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత హస్తం గూటికి చేరుకున్నారు. అంతకు ముందు నలుగురు గులాబీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ది కోసం మాట్లాడామే తప్పా కాంగ్రెస్ లో చేరాలని పోలేదన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన బొంతు రామ్మోహన్ సీఎంను కలుసుకున్నారు. ఆయన కూడా త్వరలోనే జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో వైపు ప్రముఖ మైనార్టీ లీడర్ బాబా ఫసియోద్దీన్ సైతం దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తాజాగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి తన భర్తతో కలిసి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలుసుకున్నారు.