ఏపీ పారిశ్రామిక అభివృద్దికి గోద్రెజ్ చేయూత
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైర్మన్ , ఎండీ భేటీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని రంగాలలో ఏపీ ముందుకు వెళ్లాలని , దేశానికి ఆదర్శ ప్రాయంగా కావాలని కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, ఐటీ, వనరుల వినియోగంపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
రాష్ట్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు సైతం రుణంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీ గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సచివాలంలో సమావేశం అయ్యింది. కీలక అంశాలపై చర్చించారు.
NMEO-OP స్వీకరణ, రొయ్యల ఫీడ్ BCD కోసం సహాయం అందించడం, ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. పురుగు మందుల తయారీకి 2800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలా సూచించారు.
అమరావతి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు గోద్రెజ్ చైర్మన్ ను కోరారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.