ఘనంగా గోవిందరాజ స్వామి ఉత్సవాలు
హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం
తిరుపతి – తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజ స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.భక్త జన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
త్రేతా యుగంలో రామ భక్తునిగా ప్రసిద్ధి గాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మ తత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామి వారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మ వార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.