నేతలు కాదు కార్యకర్తలే బలం
గుడివాడ అమర్నాథ్ కామెంట్స్
అమరావతి – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అసలైన బలం నేతల నుంచి కాదని కార్యకర్తలేనని అన్నారు. కలిసికట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అరెస్ట్ లు చేసినా, కేసులు నమోదు చేసినా ఎదుర్కొంటామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు అమర్నాథ్.
ఇదే సమయంలో ఏపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఊసేదంటూ ప్రశ్నించారు. సొల్లు కబుర్లతో కాలం వెళ్ల దీస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్. రైతులు రోడ్లపైకి వచ్చినా సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఆర్బీకేలు, ఉచిత బీమా సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. ఈ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు.