తప్పయితే ఒప్పందం రద్దు చేయండి
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం – మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదే పదే కూటమి సర్కార్ తమ నాయకుడు జగన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పారు. సెకీతో పలు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. తక్కువ ధరకు మన ఏపీ రాష్ట్రమే ఒప్పందం చేసుకుందని స్పష్టం చేశారు. ఎక్కడా అవినీతి, అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదన్నారు మాజీ మంత్రి.
చంద్రబాబు నాయుడును అదానీ గ్రూప్ కలిస్తే చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నారని, కానీ అదే అదానీ జగన్ మోహన్ రెడ్డిని కలవడం నేరంగా భావిస్తే ఎలా అని నిలదీశారు గుడివాడ అమర్ నాథ్. ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నది మీరేనని, జగన్ రెడ్డి చేసింది అక్రమ ఒప్పందం అని మీరు భావించినట్లయితే వాటిని రద్దు చేసే అధికారం మీకు ఉందని అన్నారు.
నిరాధారమైన విమర్శలు చేయడం కూటమి నేతలకు అలవాటుగా మారిందని ఆరోపించారు . ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.