టీసీఎస్ సరే ఫాక్స్ కాన్ సంగతేంటి..?
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
విశాఖపట్నం – ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. నారా లోకేష్ పదే పదే టీసీఎస్ గురించి చెబుతున్నారని కానీ రాష్ట్రం నుంచి ఫాక్స్ కాన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు గుడివాడ అమర్ నాథ్.
ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగానే ఫాక్స్ కాన్ ఏపీ నుంచి చెన్నైకి తరలి పోయిందని, దీనికి ప్రధాన కారకులు తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో పరిశ్రమలను తీసుకు వచ్చామని, కానీ ఈ కూటమి సర్కార్ మాత్రం తామే తీసుకు వచ్చామని గొప్పలు చెబుతోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గుడివాడ అమర్ నాథ్.
గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేయడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.