బెయిల్ మంజూరు చేసిన కోర్టు
అమరావతి – సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను దూషించిన కేసులో జైలులో ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి బెయిల్ లభించింది. నిన్ననే బెయిల్ లభించినా పేపర్లు రావడం ఆలస్యం కావడంతో విడుదల కాలేక పోయారు. ఇవాళ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కేసులు లేవంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు పోసాని కృష్ణ మురళి.
ఇదిలా ఉండగా గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు పోసాని కృష్ణ మురళి. అధికారం ఉంది కదా అని జగన్ అండ చూసుకుని అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ ను దూషించారు. ఇదే సమయంలో ఓ అడుగు ముందుకేసి ఎవరూ ఏమీ చేయలేరంటూ నోరు జారారు. దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు రెడ్ బుక్ రాస్తున్నానని, ఇందులో పేర్లు ఉన్నాయని, ఆ ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దెబ్బకు నోరు మూసుకున్నారు పోసాని కృష్ణమురళి.