రేవంత్ పాలన భేష్ – గుత్తా
శాసన మండలి చైర్మన్ కామెంట్
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన సూపర్ గా ఉందంటూ కితాబు ఇచ్చారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శుక్రవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. గతంలో జనతా దళ్ , కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.
తన తనయుడి అమిత్ రెడ్డిని ఎంపీ బరిలో నిలపాలని ప్రయత్నం చేశారు. కానీ పార్టీ హైకమాండ్ తనకు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ గుత్తా కీలక వ్యాఖ్యలు చేయడం చర్చ నీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన తనయుడికి పార్టీ పెద్దల నుంచి ఆహ్వానం అందిందని, ఆ మేరకు తను సీఎంతో కలిశాడని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానని, తనకు ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నారని, ఈ విషయం తనకు తెలిసిందన్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డితో తనకు బంధుత్వం ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.