అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా – మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగ రంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా అమ్మ వార్లకు విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిపించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరుపున స్వామి , అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాస రావు దంపతులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేపట్టారు.
అనంతరం గ్రామోత్సవంలో నందీశ్వరుడు మేళతాళాలతో కదలిరాగా , వివిధ రకాల కళారూపాల విన్యాసాలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
మాలధారణ చేపట్టిన శివ స్వాములు వేలాదిగా తరలి వస్తున్నారు శ్రీశైలం క్షేత్రానికి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కాలి నడకన విచ్చేస్తుండడంతో రహదారుల పొడవునా భక్తులకు వివిధ సంస్థలు, దాతలు నీళ్లు, అన్నదానం కార్యక్రమాలు చేపడుతున్నారు.