అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు . భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తల్లులు, వృద్దులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జేఈవో వి. వీరబ్రహ్మం.
ఇదిలా ఉండగా త్రేతా యుగంలో రామ భక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.
అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరినీళ్లు, చందనంలతో అభిషేకం చేశారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.