హనుమంత వాహనంపై కోదండ రాముడు
ఘనంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి ఉత్సవాలు
తిరుపతి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే అప్పలాయగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జూన్ 22న శనివారం హనుమంత వాహనంపై కోదండ రాముడి అలంకారంలో శ్రీ ప్రసన్న శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ కార్యక్రమం ఉదయం నభూతో నభవిష్యత్ అన్న చందంగా జరిగింది. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్ర గణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధి చెందాడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు. కనుక వీరిని దర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది అని పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిహించారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ బట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.