శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి కటాక్షం
తిరుపతి – శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీనివాసుడు వేంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరద హస్తం దాల్చిన కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతా యుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.
అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణ మండపంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.