హనుమంత వాహనంపై సిరుల తల్లి
ఘనంగా అమ్మ వారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మ వారు భక్తులకు అభయం ఇచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు . రాత్రి 7 నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు.త్రేతా యుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
టిటిడి ఈవో శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం కలిసి డిసెంబర్ 6న పద్మ సరోవరంలో జరుగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.