టి20 కెప్టెన్ గా శాంసన్ బెటర్
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్
జైపూర్ – రోహిత్ శర్మ తర్వాత టి20 భారతీయ జట్టుకు కెప్టెన్ గా సంజూ శాంసన్ అయితే బావుంటుందని బాంబు పేల్చాడు మాజీ క్రికెటర్ , ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్. జైపూర్ మాన్ సింగ్ సవాయి స్టేడియం వేదికగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. 9 వికెట్ల తేడాతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ప్రధానంగా తమ ఆటగాళ్లను ఉపయోగించుకునే తీరు ప్రతి ఒక్కరినీ కట్టి పడేసేలా చేసింది.
ఈ సందర్బంగా రోహిత్ శర్మను అవుట్ చేయించిన తీరు విస్తు పోయేలా చేసింది. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లోనే అత్యుత్తమైన కెప్టెన్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్.
మ్యాచ్ అనంతరం సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్ తో పాటు స్కిప్పర్ సంజూ శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు హర్భజన్ సింగ్. ప్రస్తుతం భారత టి20 టీమ్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడని, అతడి తర్వాత శాంసన్ ను నియమించాలని డిమాండ్ చేశాడు.
బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలన్నీ సంజూ శాంసన్ లో తనకు కనిపించాయని అన్నాడు.