NEWSTELANGANA

మాజీ స‌ర్పంచ్ ల అరెస్ట్ దారుణం – హ‌రీశ్ రావు

Share it with your family & friends

పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కితే త‌ప్పేంటి

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమ‌ని మండిప‌డ్డారు.

అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలని కోరితే అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు హ‌రీశ్ రావు.

ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా? అని నిల‌దీశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించక పోవడంలో ఆంతర్యం ఏమిటి అని నిల‌దీశారు.

అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.