కవిత అరెస్ట్ అక్రమం
మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కవితను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. తాము అరెస్ట్ ను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు హరీశ్ రావు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పన్ని కవితను అరెస్ట్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు.
అప్రజాస్వామికంగా జరిగిన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా శనివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు తన్నీరు హరీశ్ రావు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కవితను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. అరెస్ట్ లు తమకు కొత్త కాదన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో కుట్రలను ఎదుర్కొన్నామని చెప్పారు.