NEWSTELANGANA

ఖాకీల జులుం హ‌రీశ్ ఆగ్ర‌హం

Share it with your family & friends

ఇందిర‌మ్మ రాజ్య‌మంటే ఇదేనా

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తెస్తాన‌న్న మార్పు ఇదేనా అని ప్ర‌శ్నించారు. ఇందిర‌మ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటే ఇదేనా అని నిల‌దీశారు .

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు. సాగు నీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయ‌ని, ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింద‌ని వాపోయారు హ‌రీశ్ రావు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.