ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటా
స్పష్టం చేసిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు అక్రమంగా కేసులు బనాయించడం దారుణమన్నారు. అయినా లక్ష కేసులు నమోదు చేసినా తాను వెనక్కి తగ్గనని పేర్కొన్నారు. ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు హరీశ్ రావు.
ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక తన మీద అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించారంటూ ఆరోపించారు హరీశ్ రావు.
ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో తన మీద సంబంధం లేని కేసు పెట్టారని పేర్కొన్నారు. మరో కేసు మాన కొండూరులో నమోదు చేశారని తెలిపారు.
రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టారంటూ వాపోయారు.