రాహుల్ గాంధీ..అశోక్ నగర్ కు రండి
డిమాండ్ చేసిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల సందర్బంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హైదరాబాద్ లోని అశోక్ నగర్ లైబ్రరీ వద్దకు వచ్చారని, వారిలో లేని పోని ఆశలు కల్పించారని ఆరోపించారు. ఏడాదికి 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక వాటి గురించి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు హరీశ్ రావు.
తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు చేపట్టాక వాటిని తామే భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అబద్దాలు, మోస పూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 11 నెలల కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. ఇక జనం ఆ పార్టీని, సర్కార్ ను, సీఎం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు హరీశ్ రావు.
రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చిన వెంటనే అశోక్ నగర్ కు రావాలని డిమాండ్ చేశారు. అప్పుడైనా ఆయనకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటో , వాస్తవాలు ఏమిటో అర్థం అవుతాయని అన్నారు. ఏడాదిలో కనీసం 20 వేల జాబ్స్ కూడా నింపిన పాపాన పోలేదన్నారు.
జివో నెంబర్ 29 వల్ల నష్ట పోతున్నామని ఆవేదన చెందుతున్న యువతకు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు.