NEWSTELANGANA

పొద్దు తిరుగుడును కొనుగోలు చేయాలి

Share it with your family & friends

సీఎంకు త‌న్నీరు హ‌రీశ్ రావు లేఖ

హైద‌రాబాద్ – రాష్ట్రంలో పండించిన పొద్దు తిరుగుడు పంట‌ను పూర్తిగా స‌ర్కార్ కొనుగోలు చేయాల‌ని మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమ‌వారం ఆయ‌న లేఖ రాశారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండించార‌ని తెలిపారు.

ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. దానికి స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయ‌ని. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారని ఆరోపించారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని వాపోయారు. దీంతో 75 శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకుని నష్ట పోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుంద‌ని, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందని తెలిపారు. మార్కెట్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో, వారు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మాత్రమే సేకరణ జరిపారని ఆరోపించారు..

మొత్తం పంటలో కేవలం 25 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మిగతా 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఈ సారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు.