పోలీసులపై చర్య దారుణం – హరీశ్
ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల అనుసరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
“నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నోరు మెదపక పోవడం దారుణమన్నారు తన్నీర్ హరీశ్ రావు.
అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.
అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..అని మండిపడ్డారు మాజీ మంత్రి. భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించు కోవాలని కోరారు.
సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీశ్ రావు.