రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ రావు
కూల్చుకుంటూ పోతే ఎలా అని ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులను పరామర్శించారు. ఈ సందర్బంగా వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. ఇది మంచి పద్దతి కాదన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం నడవదు అని ప్రచారం చేస్తున్నాడని ఇతర రాష్ట్రాలలో, కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గూండా రాజ్ రాజ్యం నడిపిస్తున్నాడంటూ ఆరోపించారు హరీశ్ రావు.
కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని అన్నారు. ఇది మీ అయ్య జాగీరు కాదు రేవంత్ రెడ్డి. ఇక్కడ 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారని అన్నారు . ఇక్కడ ఉండే ప్రజలు అన్ని రకాల పన్నులు కడుతున్నారని, ఇలా కూల్చితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ఒకవేళ కేసు పెట్టాలని అనుకుంటే ముందు ఏ ప్రభుత్వమైతే పర్మిషన్స్ ఇచ్చిందో వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మీరు ధైర్యంగా ఉండండి అని, బుల్డోజర్లు రావాల్సి వస్తే మమ్మల్ని దాటుకొని రావాలని హెచ్చరించారు. మీరు ఫోన్ చేస్తే అర్థగంటలో మీ ముందు ఉంటామని ప్రకటించారు హరీశ్ రావు.