మాట తప్పిన సీఎం రాజీనామా చేయాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇచ్చిన మాట తప్పినందుకు ముందు తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తమకు చెందిన క్యాంప్ పై కొందరు కావాలని దాడి చేయడాన్ని తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తూ హామీలను అమలు చేయకుండా కాల యాపన చేస్తున్న ముఖ్యమంత్రి తల దించు కోవాలన్నారు హరీశ్ రావు.
ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి. రైతుల రుణాలు మాఫీ చేశామని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డిపై రైతులు గుర్రుగా ఉన్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు.
రైతుల రుణాలకు సంబంధించి రూ. 48,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం రూ. 17,833 కోట్లే ఖాతాలలో జమ చేశారని, మిగతా వారికి ఇవ్వలేదని ఆరోపించారు. అబద్దాలు చెప్పడం మానేసి వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేయాలని కోరారు హరీశ్ రావు.