బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఆదుకోండి
సీఎం రేవంత్ రెడ్డికి తన్నీరు లేఖ
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సుదీర్ఘ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి. రాష్ట్రంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్య గోచరంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సర్కార్ హయాంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కళకళ లాడిందని, తమరు కొలువు తీరాక అది దిక్కు లేనిదిగా మారి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వార్షిక బడ్జెట్ లో పరిషత్ కు రూ. 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఇందుకు సంబంధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారని వారికి ఇంత వరకు ఉపకార వేతనాలు అందలేదని వాపోయారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
దీనికి సంబంధించిన రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తన్నీరు హరీశ్ రావు. 2023-24 ఏడాదికి గాను ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
అంతే కాకుండా బెస్ట్ స్కీం కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలన్నారు. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని సీఎంను కోరారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లో పని చేస్తున్న ఉద్యోగులకు గత 7 నెలలుగా వేతనాలు అందలేదని, వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు తన్నీరు హరీశ్ రావు.