NEWSTELANGANA

సీఎం రేవంత్ కు హ‌రీశ్ రావు లేఖ

Share it with your family & friends

నిరుద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు లేఖ రాశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి. గ్రూప్స్ , డీఎస్సీ అభ్య‌ర్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

గతంలో త‌మ‌ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందన్నారు. మీరు వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేసారని తెలిపారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు.

1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని స్ప‌ష్టం చేశారు హ‌రీశ్ రావు.

గ్రూప్ 1 పరీక్ష అనేది యపీపీఎస్ఈ మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదని తెలిపారు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగిందని గుర్తు పెట్టుకోవాల‌ని పేర్కొన్నారు. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలలు కన్న గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయ‌ని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు త‌న్నీరు.