రైతులను పట్టించుకోని సర్కార్
నిప్పులు చెరిగిన హరీశ్ రావు
వనపర్తి జిల్లా – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా దేవరదక్ర నియోజకవర్గం మదనాపురం మండలం నెలివిడి గ్రామంలో వరి రైతులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ మంత్రులు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్, చర్లకోల లక్ష్మా రెడ్డి, నీళ్ల నిరంజన్ రెడ్డి, మాజీ విప్ గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్బంగా రైతులతో చాలా సేపు మాట్లాడారు హరీశ్ రావు. తాము పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా పట్టించు కోవడం లేదని అన్నారు. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ము కోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు. రైతు రుణ మాఫీ ఇంకా చేయలేదని మండిపడ్డారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు తన్నీరు హరీశ్ రావు. అమలుకు నోచుకోని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే రైతుల ఇక్కట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.