సీఎం కామెంట్స్ బక్వాస్ – హరీశ్ రావు
ఆయన చేసింది చిట్ చాట్ కాదు చీట్ చాట్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన చేసింది చిట్ చాట్ కాదు చీట్ చాట్ అంటూ ఎద్దేవా చేశారు.
అత్యున్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి తన స్థాయికి తగినట్టుగా మాట్లాడటం లేదన్నారు. రుణ మాఫీ విషయంలో రాహుల్ గాంధీని మోసం చేశారంటూ పేర్కొన్నారు. వాల్మీకి స్కాం గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదంటూ బండి సంజయ్ , కిషన్ రెడ్డిలను ప్రశ్నించారు హరీశ్ రావు.
హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం హైడ్రా ఆఫీసు బుద్ద భవన్ నాలా కింద ఉందని , మరి దానిని కమిషనర్ ఏవీ రంగనాథ్ కూల్చుతారా అంటూ నిలదీశారు. ఫోర్త్ సిటీ పేరుతో మోసం జరుగుతోందని, అక్కడ ఉన్న ప్రభుత్వ భూములను కొల్ల గొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడని ఆరోపించారు హరీశ్ రావు.
రుణ మాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆయన సీఎం గా ఒక్క నిజం కూడా చెప్ప లేదన్నారు. ఆగస్టు 15 లోగా ఎందుకు రుణ మాఫీ చేయలేక పోయారంటూ మండిపడ్డారు.
వాల్మీకి స్కాంలో తెలంగాణకు చెందిన 9 కంపెనీల ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయని ఆరోపించారు హరీశ్ రావు. ఈ డబ్బులు ఎవరెవరికి వచ్చాయో ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.