సర్కార్ నిర్వాకం విద్యార్థులకు శాపం
11 నెలల్లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. గురుకులాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఫుడ్ పాయిజన్, సూసైడ్ లు చేసుకుంటున్నా స్పందించక పోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు ఏకంగా 42 మంది విద్యార్థులు సరైన సమయంలో వైద్య సాయం అందక , ఇతర కారణాల రీత్యా ప్రాణాలు కోల్పోయారని వాపోయారు తన్నీరు హరీశ్ రావు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి..కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదంటూ ఎద్దేవా చేశారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సిఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యచరణ లేక పోవడం పట్ల మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయమని పేర్కొన్నారు.
ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు తన్నీరు హరీశ్ రావు. వాంకిడి గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని , అయినా స్పందించక పోవడం దారుణమన్నారు.