రెడ్డి కుంటలో రేవంత్ రెడ్డి ఇల్లు – హరీశ్ రావు
రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. హైడ్రా పేరుతో పేదలు, సామాన్యుల ఇళ్లను అక్రమంగా కూల్చి వేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు.
ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా పని చేయడం లేదని కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పని చేస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు. ఆదివారం ఆయన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మూసీ పరివాహక ప్రాంతాలలో ఉంటున్న బాధితులను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు తన్నీరు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని , తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన సర్వే నెంబర్ 1138 అని, ఇది పూర్తిగా కుంటలోనే ఉందని వెంటనే కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తన సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉందని, ముందు వీరి ఇళ్లను హైడ్రా కూల్చేందుకు ప్రయత్నం చేయాలని, పేదల జోలికి రావద్దని హెచ్చరించారు హరీశ్ రావు.
మీకు ఓ న్యాయం పేదలు, సామాన్యులకు ఓ న్యాయమా అని నిలదీశారు మాజీ మంత్రి.