నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి పొద్దస్తమానం కేసీఆర్ ను తిట్టడమే తప్ప ప్రజలకు పనికి వచ్చే ఒక్క పనైనా చేశాడా అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు, ఆధారాలు లేని ఆరోపణలు, చిల్లర రాజకీయాలు చేయడం పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు 36 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి వచ్చాడని, రాష్ట్రానికి సంబంధించి ఒక్క పైసా కూడా తీసుకు రాలేక పోయాడని ఎద్దేవా చేశారు. ఇక నుంచి పాలనా పరంగా ఫోకస్ పెడితే మంచిదని హితవు పలికారు.
ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్ ను వల్లించడమే తప్ప జిల్లాకు ఒరగ బెట్టిందేమీ లేదన్నారు హరీశ్ రావు.
నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్ కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపమో ఆలోచించాలన్నారు.
బంగారం పండే నల్లరేగడి భూములున్న పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణా జిల్లాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.