ఏం చేశారంటూ విజయోత్సవాలు..?
రైతులను దగా చేసినందుకా
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలంగాణ సర్కార్ పై మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నారా అంటూ నిలదీశారు.
గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు.
రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నారా. ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నారా. దేని కోసం చేస్తున్నారా చెప్పాలన్నారు.
చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావంటూ సీఎంపై మండిపడ్డారు. నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారని ఆరోపించారు తన్నీరు హరీశ్ రావు. ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
పంటలకు మద్దతు ధర లేదు, అన్ని పంటలకు బోనస్ అసలే లేదన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న భరోసాకు దిక్కే లేదన్నారు. ఈ ఏడాది పాటు రైతులకు మీరు చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గు చేటు అన్నారు.