కాంగ్రెస్ మోసం తగిన గుణపాఠం – హరీశ్
మరాఠా ఎన్నికల ఫలితాలపై కామెంట్స్
హైదరాబాద్ – మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. బీజేపీ ఏకైక పార్టీగా అవతరించింది. ఏకంగా ఆ పార్టీ 125 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కూటమి ఇప్పటి వరకు 220కి పైగా స్థానాలలో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మరోసారి ఎన్డీయే కూటమి పవర్ లోకి రానుంది. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదన్నారు. ఈ విషయం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తేలి పోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని స్పష్టం చేశారు.
మహిళలకు రూ. 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో రూ. 3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయక పోవడం వంటివి మహారాష్ట్ర లో తీవ్ర ప్రభావం చూపెట్టాయని తెలిపారు తన్నీరు హరీశ్ రావు.
తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది స్పష్టమైందన్నారు.
బీజేపీ పార్టీ..హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు తెలిపారు హరీశ్ రావు.