మాజీ మంత్రి హరీశ్ షాకింగ్ కామెంట్స్
ప్రజా పాలనపై తిరుగుబాటు తప్పదు
హైదరాబాద్ – తెలంగాణలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని రాచరిక పాలన జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. గురువారం చంచల్ గూడలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయ్యిందన్నారు. తమ భూముల తమకు కావాలని కోడంగల్ ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు తన్నీరు హరీశ్ రావు. ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతాం అని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టి కొట్టారంటూ వాపోయారు.
లగచర్ల గ్రామ ప్రజల మీద కేసులు పెట్టడం సరికాదన్నారు. కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేశారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం నరేందర్ రెడ్డి చేసిండని అన్నారు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నారని మండిపడ్డారు.
విద్యార్థులు తిరగబడినా, రైతులు రోడ్ల మీదకు వచ్చినా , పోలీసులు రోడ్డెక్కి ధర్నాలు చేసినా , గురుకుల విద్యార్థులు తమకు తిండి, వైద్యం అందడం లేదని వాపోయినా అంతా వీరి వెనుక బీఆర్ఎస్ ఉందంటూ ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు హరీశ్ రావు.
ఇలాగే వ్యవహరిస్తూ పోతే చివరకు ప్రజలలో అసంతృప్తి పెరిగి ఆందోళనకు దిగే ప్రమాదం ఉందన్నారు