టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీనా
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. టీజీపీఎస్సీ తాజాగా నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రశ్నలు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనా లేక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష తయారు చేసిందా అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలని అనుకుంటున్న రేవంత్ కు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా? , రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా? అంటూ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ప్రశ్నలు అడగడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీశ్ రావు.
అసలు ఈ ప్రశ్నలను చూస్తే, టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగుతోందన్నారు. మలి తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు.
ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరిపేస్తే చెరిగి పోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించిందని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.