హస్తం..కమలం తెలంగాణకు మోసం
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు. పనిగట్టుకుని తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేస్తున్నాయని వాపోయారు.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చెరో పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు కట్టబెట్టారని తీరా వారు ఏ ఒక్కరు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్ర కేబినెట్ లో ఉన్నారని , ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్ లో ఒక్క పైసా కేటాయించక పోతే అడిగిన పాపాన పోలేదన్నారు.
బీజేపీకి ఆంధ్రా తీపిగా మారిందని తెలంగాణ చేదుగా అనిపిస్తోందని అన్నారు. మేడగడ్డలో 2 పిల్లర్స్ కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు హరీశ్ రావు. కాళేశ్వరం కూలిపోతే రంగనాయక సాగర్‌లో నీళ్లు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.