హామీలు సరే కొలువుల కథేంటి..?
మాజీ మంత్రి తన్నీర్ హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నికలలో 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేసిన పాపాన పోలేదన్నారు.
హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎంకు లేఖ రాసినట్లు చెప్పారు. తాను ఎన్ని లేఖలు రాసినా స్పందన రావడం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని ప్రకటించారని ఇప్పటి వరకు అది ఎక్కడ ఉందో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.
ఏడు డిమాండ్లను తీర్చాలని కోరారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా, 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని అన్నారు. గ్రూప్ 2కు 2 వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 కి 3 వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామంటూ మాట ఇచ్చారని గుర్తు చేశారు.
జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉందని, గ్యాప్ తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు. పరీక్షల తేదీల మధ్య ఎక్కువ రోజుల వ్యవధి ఉండేలా చూడాలని సూచించారు హరీశ్ రావు.
25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని, 2 లక్షల జాబ్స్ తో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.