సీఎం నిర్లక్ష్యం విద్యా రంగానికి శాపం
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వంత నియోజకవర్గం కోడంగల్ లో టీచర్లు లేక పాఠశాల మూత పడడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు.
బుధవారం హరీశ్ రావు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకుండా పోయారని వాపోయారు. కీలకమైన ఈ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్నారని, దీంతో దానిపై నియంత్రణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
కోడంగల్ లో టీచర్లు లేక బడిని మూసి వేయడం బాధాకరమని పేర్కొన్నారు హరీశ్ రావు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించు కోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నారని ఆరోపించారు హరీశ్ రావు. పేద పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు .
రాష్ట్రంలో పాఠశాలలు మూత పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని, రేవంత్ రెడ్డి నిద్ర పోతున్నారా అని భగ్గుమన్నారు హరీశ్ రావు.