అన్నదాతలు ఆగమాగం
హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు దిగజారి పోతున్నాయని ఆవేదన చెందారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొందన్నారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించు కోవడం లేదని వాపోయారు.
హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండాలో క్షేత్ర స్థాయి పర్యటన చేశామని తెలిపారు. అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.
ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని తమతో చెప్పారని హరీశ్ రావు అన్నారు. ఓ వైపు పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు.. తండాల్లో తాగు నీరు కూడా సరిగా రావడం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు హరీశ్ రావు. ఓ వైపు పంటలు ఎండి పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు అప్పులు గుది బండగా మారాయని వాపోయారు. ఇకనైనా సీఎం దృష్టి సారించాలని కోరారు.