పాపాత్ముడైన రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుతాం
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు వేశారని, కానీ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదాద్రి దేవాలయం దర్శించుకుంటామని తెలిపారు. తనతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేస్తామని చెప్పారు హరీశ్ రావు.
ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించమని, తెలంగాణ ప్రజలపై దయ ఉంచమని యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని వేడుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థిస్తామని చెప్పారు .
రుణ మాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారని ఎద్దేవా చేశారు. మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో 26 వేల కోట్లకు కుదించారని, ఆగస్టు15 నాడు రుణమాఫీ పూర్తయిందని చెప్పి 17 వేల కోట్లన్నారని దీనిలో ఏది నిజమని నమ్మాలో తెలియడం లేదన్నారు హరీశ్ రావు.
కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటానని స్పష్టం చేశారు.