హామీలు కావవి పచ్చి అబద్దాలు
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
మెదక్ జిల్లా – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆటో యూనియన్ కార్మికులతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో వెనుకంజ వేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఏడున్నాడని ప్రశ్నించారు. తాము పరీక్షలు నిర్వహిస్తే అధికారంలోకి వచ్చాక రిజల్ట్స్ ప్రకటించి భర్తీ చేశామని చెప్పడం దారుణమన్నారు హరీశ్ రావు.
తాను విసిరిన సవాల్ కు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. ఇక కార్మికులకు ముందస్తు మే డే సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి.
కార్మికులు లేక పోతే సమాజం , దేశం ఉండదన్నారు. వారి శ్రమ ఫలితమే ఇవాళ కోట్లాది మందికి కూడు దొరుకుతోందన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తన తప్పు తెలుసుకుని ముక్కు నేలకు రాయాలన్నారు. అవాకులు చెవాకులు బంద్ చేస్తే మంచిదని హితవు పలికారు .