పిల్లలకు అన్నం పెట్టని సీఎం ఎందుకు..?
పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా – రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. శనివారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా పిల్లలతో మాట్లాడారు. తమకు సరిగా అన్నం పెట్టడం లేదంటూ బాలికలు వాపోయారు. తమను ఆదుకోవాలని కోరారు.
పిల్లలను పరామర్శించిన అనంతరం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. విద్యా శాఖ తన ఆధీనంలోనే రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలతో పాటు అన్ని బడులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
సోయి తప్పి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మీ శాఖలోనే ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పాలనా పరంగా రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం పైనే ఫోకస్ పెట్టడం తప్పితే పిల్లలకు సరైన ఆహారం అందుతుందా అన్నది చూడక పోవడం దారుణమన్నారు.
ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. మీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసు కోకుండా ప్రతిపక్షాలను గొంతు నొక్కడంపై ఫోకస్ పెట్టడం బంద్ చేస్తే మంచిదన్నారు హరీశ్ రావు. గురుకులాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారని ఆవేదన చెందారు.