రైతన్నల పట్ల ఎందుకింత కక్ష
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక పోవడం , కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతల్లో కనిపించడం లేదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకే ఒక్కటి అమలు చేశారని, అది కేవలం ఉచితంగా బస్సు ప్రయాణం తప్ప అని ఎద్దేవా చేశారు తన్నీరు హరీశ్ రావు. రైతులంతా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని వాపోయారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం.. బాగుపడిన చరిత్ర ఇప్పటి వరకు చరిత్రలో లేదన్నారు తన్నీరు హరీశ్ రావు. అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చేలా చేశాయని పేర్కొన్నారు మాజీ మంత్రి. రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ సర్కార్ రోజుకో మాట మారుస్తోందని ఆరోపించారు హరీశ్ రావు.