కాంగ్రెస్ ప్రచారం తన్నీరు ఆగ్రహం
మేం భర్తీ చేస్తే సీఎం హడావుడి
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై , సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో భర్తీ ప్రక్రియ చేపడితే ఇప్పుడు నియామక పత్రాల అందజేత పేరుతో హస్తం ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు .
పంట అయినంక గరిట తిప్పినట్లు అన్న చందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు తన్నీరు హరీశ్ రావు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే అదేదో తాము చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఫిబ్రవరి 1 న గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిందని ఇప్పటి వరకు దాని ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. దాని దృష్టి మరల్చేందుకే ఇవాళ స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్బాటంతో నిర్వహిస్తున్నదని ఫైర్ అయ్యారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హితవు పలికారు.
తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారా మెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్ కు శ్రీకారం చుట్టిందని చెప్పారు.