NEWSTELANGANA

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్ బాధాక‌రం

Share it with your family & friends

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంపై హ‌రీష్ ఫైర్

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన స‌ర్కార్ అన్నింటినీ ప‌క్క‌న పెట్టింద‌ని ఆరోపించారు.

ఒక‌టో తారీఖునే ప్ర‌భుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ జీతాలు ఇస్తామంటూ న‌మ్మించింద‌ని చివ‌ర‌కు వేత‌నాలు ఇవ్వ‌కుండా వేధింపులకు గురి చేస్తంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గ‌త మూడు నెలలుగా జీతం రాక, ఆర్థిక కష్టాలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమ‌ని పేర్కొన్నారు.

ఒకటో తేదీన‌ వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించక పోవడం విడ్డూరంగా ఉంద‌న్నారు.

కాంగ్రెస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు శాపంగా మారిందని ధ్వ‌జ‌మెత్తారు హ‌రీశ్ రావు. ఎవరూ అధైర్య పడవద్దని , నిరాశ చెంద‌వ‌ద్ద‌ని, బ‌తికి సాధించు కోవాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి.

మీ తరుపున పోరాటం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.