ఏఈవోలను సస్పెండ్ చేయడం దుర్మార్గం
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై హరీశ్ ఆగ్రహం
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
డిజిటల్ సర్వేకు ఒప్పు కోలేదన్న కారణంతో 163 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ సర్వే చేయిస్తుంటే, తెలంగాణలో ఏఈవోలపై అదనపు భారాన్ని రుద్దుతూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని అన్నారు హరీశ్ రావు.
రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపుదల లక్ష్యంలో భాగంగా 1500 కొత్త ఏఈవోల పోస్టులను సృష్టించారని తెలిపారు. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ విజయగాథలో ఏఈవోల పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేశారు.
అలాంటి వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఉద్యోగులపై బలవంతంగా భారం వేయడం, మాట వినలేదని సస్పెండ్ చేయడమేనా మీ ప్రజాపాలన అని ప్రశ్నించారు.
సస్పెండ్ చేసిన 163 ఏఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, డిజిటల్ సర్వే ఏఈవోలకు భారం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.